Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తిరుపతి రూపురేఖలు మార్చేలా రూ.3,222 కోట్ల అభివృద్ధి పనులు!

    తిరుపతి రూపురేఖలు మార్చేలా రూ.3,222 కోట్ల అభివృద్ధి పనులు!

    రాజనీతి | అమరావతి | అక్టోబర్‌ 12, 2026

    ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిని ఆధ్యాత్మికత, ఆధునిక సౌకర్యాల సమ్మేళనంగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. అమరావతి సచివాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన ‘వెంకటాద్రి’ యాప్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు.

    భక్తుల కోసం రూ.2,750 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ పిలిగ్రిమ్‌ టౌన్‌షిప్‌ | రెండేళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం | ‘వెంకటాద్రి’ యాప్‌ ఆవిష్కరణ.. తిరుపతి–రేణిగుంటను క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళిక

    ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానంగా రూ.2,750 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్‌ పిలిగ్రిమ్‌ టౌన్‌షిప్‌కు ప్రాధాన్యం కల్పించారు. భక్తులకు మెరుగైన వసతులు అందించే లక్ష్యంతో రూపొందించిన ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు ప్రారంభించే సమయంలోనే ప్రారంభోత్సవానికి లక్ష్య తేదీని నిర్ణయించుకోవాలని సూచించారు. ప్రాజెక్టు అమలులో నాణ్యతకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు.

    ఇవి కూడా చదవండి

    తిరుమలలో కనిపించే ప్రశాంతమైన, పవిత్రమైన వాతావరణం కొత్త టౌన్‌షిప్‌లోనూ ప్రతిబింబించాలని సీఎం అభిప్రాయపడ్డారు. తిరుపతికి వచ్చే ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా పరిసరాలను తీర్చిదిద్దాలని సూచించారు. గోశాలలను కేవలం నిర్వహణ కేంద్రాలుగా కాకుండా గోసేవ ప్రాధాన్యాన్ని తెలియజేసే అనుభూతి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

    తిరుపతి నుంచి రేణిగుంట వరకు విద్య, వైద్యం, పరిశ్రమలు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పరిశుభ్రమైన హరిత నగరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు సూచించారు. చెరువులను అనుసంధానించడం, పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రజలకు ఆహ్లాదకరమైన నడక మార్గాలను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు. తిరుమలలో ఉన్న పచ్చదనం తిరుపతిలోనూ కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు.

    టీటీడీ ఉద్యోగుల గృహవసతి అవసరాలను తీర్చేందుకు ఆధునిక టౌన్‌షిప్‌ ఏర్పాటుపైనా సీఎం అధికారులతో చర్చించారు. ఉద్యోగులకు గౌరవప్రదమైన నివాస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తిరుపతిలో ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో పాటు స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

    ఆధ్యాత్మికతకు సాంకేతికతను జోడించడం ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధి పనులు కేవలం నిర్మాణాలకే పరిమితం కాకుండా తిరుపతి ప్రత్యేకతను, పవిత్రతను కాపాడేలా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర, పాలకమండలి సభ్యులు, తిరుపతి జిల్లా అధికారులు, తుడా ప్రతినిధులు వర్చువల్‌గా పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి