🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 22 Jul, 2026 | Page: 1

NEET అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి-NSUI రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ

NEET అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

- రాహుల్ గాంధీపై పోలీసుల దురుసు వైఖరిని ఖండిస్తున్నాం
- NSUI రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ

పీలేరు, అన్నమయ్య జిల్లా:

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ, AICC అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు, యువతపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ నేడు పీలేరు అంబేద్కర్ సర్కిల్‌లో NSUI ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి NSUI ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను బలవంతంగా అడ్డుకోవడం, వారిపై పోలీసు బలగాలను ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని అన్నారు. నిన్న జరిగిన నిరసనలో రాహుల్ గాంధీపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం వల్ల ఆయనకు గాయాలు కావడం దేశ ప్రజలను కలచివేసిందని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఆ హక్కును కాలరాస్తూ విద్యార్థులు, యువత, కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం, నిర్బంధించడం అత్యంత ఖండనీయమని అన్నారు.

అదేవిధంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన NEET పరీక్షలో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని, NEET అక్రమాలపై నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారానికి సంబంధించి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాలపై స్పందించకుండా బీజేపీకి కొమ్ముకాస్తున్నాయని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువత, ప్రజలు అన్నీ నిశితంగా పరిశీలిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసే వారికి, విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేసే వారికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రతి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, విద్యార్థుల హక్కులు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం NSUI పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో NSUI జిల్లా అధ్యక్షులు సాయి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home