🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 19 Jul, 2026 | Page: 1

జాతీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)–2.0లో చిన్నారులకు తొలిసారి షుగర్‌, బీపీ స్క్రీనింగ్

జాతీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)–2.0లో 62.65 లక్షల మందికి 38 రకాల ఆరోగ్య పరీక్షలు

థైరాయిడ్‌, ఊబకాయం, మొబైల్‌ వినియోగం, నిద్ర సమస్యలూ పరీక్షల పరిధిలోకి

వ్యాధి గుర్తింపు నుంచి ఉచిత చికిత్స వరకు సమగ్ర వ్యవస్థ:

మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి

చిన్న వయస్సులోనే మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేక స్క్రీనింగ్‌కు శ్రీకారం చుట్టింది. జాతీయ బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని (ఆర్‌బీఎస్‌కే) మరింత విస్తరించి ఆర్‌బీఎస్‌కే–2.0గా అమలు చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 62.65 లక్షల మంది చిన్నారులకు 38 రకాల సమగ్ర ఆరోగ్య పరీక్షలు** నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి *శ్రీ సత్యకుమార్‌ యాదవ్ తెలిపారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వారికి పూర్తిగా ఉచిత చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే స్క్రీనింగ్ ప్రారంభిస్తామని నేడు ఒక ప్రకటనలో తెలిపారు

2026–27 ఆర్థిక సంవత్సరంలో అంగన్‌వాడీ కేంద్రాల్లోని *20.95 లక్షల మంది (0–6 ఏళ్లు), ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న 41.70 లక్షల మంది* (6–18 ఏళ్లు) విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, పోషకాహార సమస్యలు, వివిధ వ్యాధులు, ఎదుగుదలలో జాప్యం, వైకల్యాలను సకాలంలో గుర్తించి చికిత్స అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.

జీవనశైలి వ్యాధులపై ప్రత్యేక దృష్టి

ఇప్పటి వరకు సాధారణ ఆరోగ్య పరీక్షలకే పరిమితమైన ఆర్‌బీఎస్‌కే కార్యక్రమాన్ని ఈసారి మరింత విస్తరించినట్లు మంత్రి తెలిపారు. మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్‌ గ్రంథి సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు, పుట్టకతో మూత్ర nalalu, mutrapindala lopalu, రోజు వారీ అధిక సెల్‌ఫోన్‌ వినియోగం, నిద్ర సంబంధిత సమస్యలు, సమగ్ర అభివృద్ధి లోపాల వంటి ఎనిమిది కొత్త ఆరోగ్య పరిస్థితులను తొలిసారిగా పరీక్షల పరిధిలోకి తీసుకొచ్చామని వెల్లడించారు. మారుతున్న జీవనశైలి కారణంగా చిన్నారుల్లోనూ ఇటువంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు గుర్తింపునకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.

నాలుగు విభాగాల్లో 38 రకాల పరీక్షలు

ఆర్‌బీఎస్‌కే–2.0 కింద పరీక్షలను నాలుగు ప్రధాన విభాగాలు(4-డి లు) గా నిర్వహించనున్నారు.

1.జన్యుపరమైన లోపాలు, 2.పోషకాహార లోపాలు, 3.వ్యాధులు,
4.అభివృద్ధి, ఆలస్యాలు–వైకల్యాలు

ఈ నాలుగు విభాగాలను ఆంగ్ల లో : "Defects at Birth, Deficiencies ,Diseases ,Developmental Delays including Disabilities" గా
వ్యవహరిస్తున్నారు.

*జన్యుపరమైన లోపాల కింద నాడీ సంబంధిత లోపాలు, డౌన్‌ సిండ్రోమ్‌, చీలిన పెదవి, వంకర పాదం, గుండె, కంటి, చెవి లోపాలు, రెటీనా వ్యాధులు, మూత్రపిండాలు–మూత్రనాళాల జన్యుపరమైన లోపాలను గుర్తిస్తారు.

*పోషకాహార విభాగంలో విటమిన్‌-ఏ, విటమిన్‌-డి లోపాలు, రక్తహీనత, పోషకాహార లోపం, ఊబకాయం, థైరాయిడ్‌ గ్రంథి వాపును పరీక్షిస్తారు.

*వ్యాధుల విభాగంలో చర్మ, గుండె, శ్వాసకోశ వ్యాధులు, దంత సమస్యలు, మూర్ఛ, క్షయ, కుష్ఠుతో పాటు **
మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, అధిక సెల్‌ఫోన్‌ వినియోగం* వంటి అంశాలను పరిశీలిస్తారు.

*అభివృద్ధి ఆలస్యాలు–వైకల్యాల విభాగంలో దృష్టి, వినికిడి లోపాలు, కదలిక సమస్యలు, భాషా, జ్ఞాన వికాస లోపాలు, ప్రవర్తనా రుగ్మతలు, ఆటిజం, ప్రత్యేక అభ్యాస లోపాలు, *నిద్ర సమస్యలు, సమగ్ర అభివృద్ధి ఆలస్యాన్ని* గుర్తిస్తారు.

లక్షణాల ఆధారంగా ప్రత్యేక స్క్రీనింగ్

మధుమేహ లక్షణాలైన తరచూ మూత్ర విసర్జన, అధిక దాహం, కారణం లేకుండా బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలు ఉన్న పిల్లలను ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు గుర్తించి అవసరమైతే రక్తంలో చక్కెర పరీక్షలు నిర్వహిస్తారు. తలనొప్పి, తలతిరగడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు ఉన్న వారికి రక్తపోటు పరీక్షలు చేసి వైద్యాధికారుల వద్దకు రిఫర్‌ చేస్తారు. మెడ ముందు భాగంలో వాపు కనిపిస్తే థైరాయిడ్‌ సమస్యలపై పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కొత్త పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ అందించినట్లు మంత్రి తెలిపారు.

పాఠశాలలకే వైద్య బృందాలు

ఆరోగ్య బృందాలు నేరుగా అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను సందర్శించి ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించిన పిల్లలను వైద్యాధికారులు మరోసారి పరీక్షించి అవసరాన్ని బట్టి జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ బోధనాసుపత్రులకు పంపిస్తారు. **వ్యాధి గుర్తింపు నుంచి నిపుణుల వైద్యం వరకు పూర్తిగా ఉచిత సేవలు అందేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించామని** మంత్రి తెలిపారు.

ఆరోగ్యవంతమైన బాల్యమే లక్ష్యం**

*చిన్నారులే రేపటి భారత భవిష్యత్తు. ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి ఉచిత వైద్యం అందించడం ద్వారా ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఎదిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. జాతీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే )–2.0తో పిల్లల ఆరోగ్య సంరక్షణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతాం"** అని మంత్రి **సత్యకుమార్‌ యాదవ్ పేర్కొన్నారు.
🏠 Home