🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 07 Jul, 2026 | Page: 1

జీవో 396 వెంటనే రద్దు చేయాలి దస్తావేజు రచయితల ఆందోళన ఉధృతం.. అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన

మదనపల్లి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు రచయితలు, వారి సహాయకులు ఆందోళనను ఉధృతం చేశారు. గత ఆరు రోజులుగా సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారు, మంగళవారం కార్యాలయం ముందు బైఠాయించి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ జీవో అమలుతో రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు రచయితల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయాలను నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న వేలాది మంది దస్తావేజు రచయితలు, వారి సహాయకుల కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయని పేర్కొన్నారు. ఈ వృత్తిపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవో 396ను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంతో పాటు అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను రద్దు చేసి దస్తావేజు రచయితల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. దస్తావేజు లేఖర్ల సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కంగేరి నంద ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు రాజేంద్ర, ఇమ్రాన్ భాష, కుళ్లాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home