ఆసుపత్రుల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకాల పరిశీలన: జిల్లా సమన్వయకర్త డాక్టర్ లోకవర్ధన్
తంబళ్లపల్లె / మదనపల్లె : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త డాక్టర్ పి. లోకవర్ధన్ మంగళవారం తంబళ్లపల్లె కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)తో పాటు మదనపల్లెలోని రమా నేత్రాలయను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ఆసుపత్రుల్లో అందుతున్న 14 రకాల వైద్య సేవల అమలు తీరుపై ఆయన సమగ్రంగా విచారణ జరిపారు. అర్హులైన రోగులందరికీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఉచిత వైద్యం సక్రమంగా అందేలా చూడాలని ఈ సందర్భంగా అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని పెంచలమర్రి గ్రామంలో పర్యటించి, అక్కడ జరుగుతున్న 104 వైద్య సేవలను ఆయన పరిశీలించారు. 104 సేవల వినియోగం, రికార్డుల నిర్వహణపై అక్కడి వైద్య సిబ్బందికి తగు సలహాలు అందజేశారు. ప్రభుత్వం ఈ సేవలను ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందిస్తోందని, కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని డాక్టర్ లోకవర్ధన్ సూచించారు.