🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 16 Jun, 2026 | Page: 1

వ్యాధులు సోకని బిడ్డతోనే బలమైన ముందు తరం సాధ్యం: వైద్యాధికారి డాక్టర్ శ్రీ గిరీష

తలుపుల : డయేరియా (అతిసార) సోకిన పిల్లలకి ఓఆర్‌ఎస్ రక్షణ, జింక్ మాత్రల శక్తితో నీళ్ల విరోచనాలకు అడ్డుకట్ట వేయవచ్చని తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శ్రీ గిరీష తెలిపారు. 'స్టాప్ డయేరియా' (అతిసార నియంత్రణ) కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం తలుపులలో ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, అవగాహన సదస్సు మరియు ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ గిరీష మాట్లాడుతూ.. పిల్లలకు విరోచనాలు అయ్యే సమయంలో తల్లులతో పాటు కుటుంబ సభ్యులు కూడా పూర్తి అవగాహన కలిగి వేగంగా స్పందించి బిడ్డ ప్రాణాలను కాపాడాలని కోరారు. ఐదేళ్ల లోపు (0-5 సంవత్సరాల) పిల్లల మరణాల రేటును సున్నా (జీరో) కి తీసుకురావడమే స్టాప్ డయేరియా కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. నేటి నుండి స్థానిక ఆశా కార్యకర్తలు ఐదేళ్ల లోపు పిల్లలున్న ప్రతి గృహాన్ని సందర్శించి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలను పంపిణీ చేయడంతో పాటు అవసరమైన ఆరోగ్య విద్యా బోధన అందిస్తారని వివరించారు. పిల్లలలో అధిక జ్వారం, పదే పదే వాంతులు కావడం, కళ్ళు లోపలికి పోవడం, తల్లి పాలు తాగలేకపోవడం, తీవ్ర నీరసం వంటి లక్షణాలు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తల్లులకు, కుటుంబ సభ్యులకు సిబ్బంది వివరిస్తారని ప్రజలకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఈఓ కొండయ్య, సెక్రటరీ సుబ్రహ్మణ్యం రెడ్డి, హెచ్.వి నాగమ్మ, ఏఎన్ఎంలు ఫా ముసా, నాగవేణి మరియు ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, తల్లులు పాల్గొన్నారు.
🏠 Home