చేతుల శుభ్రతతో ఆరోగ్యానికి భద్రత:డా. చంద్రశేఖర్ నాయక్
పీలేరు అక్టోబరు 15 (రాజనీతి): చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక అంటువ్యాధులను నివారించవచ్చని తలుపుల పీహెచ్సీ వైద్యాధికారి డా. చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం సందర్భంగా పీలేరు సైనిక నగర్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భోజనానికి ముందు, మరుగుదొడ్డి వినియోగించిన తర్వాత సబ్బుతో ఆరు పద్ధతుల్లో కనీసం 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలని సూచించారు. న్యూమోనియా, విరేచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. సీహెచ్ఓ చంద్రకళ చేతులు కడిగే పద్ధతులను ప్రదర్శించారు. కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఈఓ కొండయ్య, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.