బీసీలకు సముచిత గౌరవం.. మేయర్ పదవి రిజర్వేషనే నిదర్శనం: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్...
చిత్తూరు(రాజనీతి): తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. నాడు నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించినప్పటి నుంచి నేటి వరకు బీసీలు పార్టీకి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం చిత్తూరులోని బీసీ భవన్లో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.టీడీపీ అనేకమంది బీసీలకు ఉన్నత పదవులు కల్పించి గౌరవించిందని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ కోసం కష్టపడుతూ, ప్రజల్లో ఉంటూ పనిచేస్తున్న బీసీలకు మేయర్ పదవిని రిజర్వు చేయడం పార్టీలో వారికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోందన్నారు. బీసీలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బీసీలకు మరిన్ని ఉన్నత పదవులు దక్కే అవకాశాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీలు రాజకీయంగా, సామాజికంగా మరింత ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.మేయర్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పించినా, నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత అభిప్రాయాలకు తావివ్వకుండా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. అందరూ సమన్వయంతో కృషి చేసి కూటమి అభ్యర్థి విజయానికి బాటలు వేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో చుడా ఛైర్పర్సన్ కఠారి హేమలత, కూటమి పార్టీల నాయకులు, బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.