కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గినా.. గోపీనాథ్ ముందడుగు...గోపీనాథ్ సేవాభావాన్ని కొనియాడిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్...
చిత్తూరు(రాజనీతి): ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టడంలో 16వ డివిజన్ ఇన్చార్జి గోపీనాథ్ ముందుంటున్నారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రశంసించారు. గుడిపాల మండలం కుప్పిగానిపల్లి పంచాయతీ పరిధిలోని బొజ్జవారిపల్లి, బుచ్చనకండ్రిగలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును సోమవారం చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, సీకే లావణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల విషయంలో గోపీనాథ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, పనులు చేయలేమని చెప్పిన సమయంలో కాంట్రాక్టర్గా పనిచేస్తున్న గోపీనాథ్ను తీసుకొచ్చి ప్రజలకు అవసరమైన పనులు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే దాదాపు రూ.20 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఆయన ఆధ్వర్యంలో జరిగాయని పేర్కొన్నారు.ప్రజల కోసం ఇంతటి బాధ్యత తీసుకుని పనిచేస్తున్న గోపీనాథ్ మనసు ఎంతో మంచిదని ఎమ్మెల్యే కొనియాడారు. పదవి కోసం కాకుండా ప్రజల అవసరాల కోసం పనిచేసే నాయకులకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం నాయుడు, పీటర్, బాలసుబ్రహ్మణ్యం, అనిల్, ఉమాశ్రీ, శరత్, కేశవ్ యాదవ్ తదితరులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.