🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 03 Oct, 2026 | Page: 1

PF క్లెయిమ్‌ రిజెక్ట్‌ అవుతోందా? ఈ 10 తప్పులు చేయొద్దు!

రాజనీతి | బిజినెస్‌ | అక్టోబర్‌ 3, 2026

UAN–ఆధార్‌ వివరాల తేడా నుంచి బ్యాంక్‌ ఖాతా సమస్యల వరకు.. క్లెయిమ్‌ పెట్టే ముందు ఇవన్నీ చెక్‌ చేసుకోండి

అవసరమైన సమయంలో PF డబ్బు చేతికి వస్తుందని ఉద్యోగులు భావిస్తారు. కానీ క్లెయిమ్‌ చేసిన తర్వాత అది తిరస్కరణకు గురైతే ఇబ్బందులు తప్పవు. UAN, ఆధార్‌ వివరాల్లో స్వల్ప తేడా ఉన్నా.. బ్యాంక్‌ ఖాతా వివరాలు సరిగ్గా లేకపోయినా క్లెయిమ్‌ ప్రక్రియలో సమస్యలు రావచ్చు. తాజాగా EPFO క్లెయిమ్‌ రిజెక్షన్‌కు దారితీసే సాధారణ కారణాలపై అవగాహన అవసరం.

1. UAN–ఆధార్‌ వివరాలు సరిపోకపోవడం

UAN, ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో తేడాలు ఉంటే వెరిఫికేషన్‌లో సమస్యలు రావచ్చు. క్లెయిమ్‌ చేయడానికి ముందే రెండు రికార్డుల్లోని వివరాలను పరిశీలించాలి.

2. బ్యాంక్‌ వివరాల్లో తప్పులు

బ్యాంక్‌ ఖాతా నంబర్‌, IFSC లేదా ఖాతాదారుడి పేరు తప్పుగా నమోదై ఉంటే PF నగదు బదిలీలో ఇబ్బందులు ఎదురవుతాయి. EPFOలో నమోదైన బ్యాంక్‌ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో చెక్‌ చేసుకోవాలి.

3. బ్యాంక్‌ ఖాతా క్లోజ్‌ అయి ఉండటం

EPFO రికార్డుల్లో ఉన్న ఖాతా మూసివేయబడి ఉండటం లేదా యాక్టివ్‌గా లేకపోవడం కూడా క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌కు అడ్డంకిగా మారొచ్చు.

4. KYC పూర్తి కాకపోవడం

ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా, ఇతర అవసరమైన KYC వివరాలు సరిగ్గా నమోదు చేసి వెరిఫై చేయించుకోవడం ముఖ్యం. KYCలో పెండింగ్‌ అంశాలు ఉంటే ముందుగా వాటిని పరిష్కరించాలి.

5. పేరు, పుట్టిన తేదీలో వ్యత్యాసాలు

ఆధార్‌, EPFO, బ్యాంక్‌ రికార్డుల్లో పేరు లేదా DOB వేర్వేరుగా ఉంటే సిస్టమ్‌ వెరిఫికేషన్‌లో సమస్య రావచ్చు. ప్రస్తుతం Aadhaar-validated UAN ఉన్న సభ్యులు కొన్ని ప్రొఫైల్‌ వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా సరిచేసుకునే వెసులుబాటు కూడా EPFO కల్పించింది.

6. కంపెనీ రికార్డుల్లో తప్పులు

ఉద్యోగి వివరాల్లో తప్పు లేకపోయినా.. కంపెనీ రికార్డుల్లో జాయినింగ్‌ డేట్‌ లేదా ఎగ్జిట్‌ డేట్‌ తప్పుగా ఉంటే క్లెయిమ్‌ ప్రభావితం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో HR/యజమాని ద్వారా రికార్డులను సరిచేయించుకోవాలి.

7. ఎగ్జిట్‌ డేట్‌ అప్‌డేట్‌ కాకపోవడం

ఉద్యోగం వదిలిన తర్వాత EPFO రికార్డుల్లో Date of Exit అప్‌డేట్‌ కాకపోతే కొన్ని క్లెయిమ్‌లలో సమస్యలు రావచ్చు. క్లెయిమ్‌కు ముందు ఈ వివరాన్ని పరిశీలించడం మంచిది.

8. తప్పు క్లెయిమ్‌ ఆప్షన్‌ ఎంచుకోవడం

వైద్యం, వివాహం, ఇల్లు తదితర అవసరాలకు PF అడ్వాన్స్‌ తీసుకునే నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. తప్పు క్లెయిమ్‌ రకం లేదా కారణాన్ని ఎంచుకుంటే రిజెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

9. పాత క్లెయిమ్‌ లేదా ట్రాన్స్‌ఫర్‌ పెండింగ్‌లో ఉండటం

ఇప్పటికే మరో PF క్లెయిమ్‌ పెండింగ్‌లో ఉన్నా లేదా పాత PF ఖాతా నుంచి కొత్త ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ పూర్తికాకపోయినా కొత్త క్లెయిమ్‌పై ప్రభావం ఉండొచ్చు.

10. ఉపసంహరణకు అర్హత లేకపోవడం

ప్రతి రకమైన PF ఉపసంహరణకు నిర్దిష్ట అర్హతలు ఉంటాయి. వాటిని పరిశీలించకుండా క్లెయిమ్‌ చేస్తే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

క్లెయిమ్‌ రిజెక్ట్‌ అయితే ఏం చేయాలి?

మళ్లీ వెంటనే అప్లై చేయడం కంటే ముందుగా EPFO పోర్టల్‌లో Claim Status, Remarks పరిశీలించి రిజెక్షన్‌కు అసలు కారణాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత UAN, KYC, బ్యాంక్‌, ఉద్యోగ వివరాలను సరిచేసి అవసరమైతే మళ్లీ క్లెయిమ్‌ దాఖలు చేయాలి.

అలాగే EPFO ఇటీవల క్లెయిమ్‌ ప్రక్రియను సరళీకరించింది. ఆన్‌లైన్‌ క్లెయిమ్‌ సమయంలో చెక్‌ లీఫ్‌ లేదా అటెస్టెడ్‌ బ్యాంక్‌ పాస్‌బుక్‌ కాపీని అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరాన్ని తొలగించింది. బ్యాంక్‌ ఖాతా UANతో సీడ్‌ చేసే ప్రక్రియలోనూ మార్పులు చేసింది.

PF క్లెయిమ్‌లో చిన్న తప్పే.. డబ్బు విడుదలలో పెద్ద ఆలస్యానికి కారణం కావచ్చు. క్లెయిమ్‌ చేసే ముందు వివరాలన్నింటినీ ఒక్కసారి చెక్‌ చేసుకోవడం కీలకం.
🏠 Home