🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 26 Sep, 2026 | Page: 1

పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం పెట్టడం కష్టంగా ఉందా? తల్లులు ఇలా చేస్తే సులభమే!

రాజనీతి | హెల్త్‌ డెస్క్‌:
పిల్లలకు పోషకాహారం అందించడం తల్లిదండ్రులకు తరచూ సవాలుగా మారుతుంది. ముఖ్యంగా చిన్నారులు కొత్త రుచులు, వాసనలు, ఆకృతులు ఉన్న ఆహారాన్ని తిరస్కరించడం సాధారణమే. ఇలాంటి సమయంలో పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం కంటే.. ఆహారాన్ని పరిచయం చేసే విధానాన్ని మార్చడం ఉపయోగకరంగా ఉంటుందని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ సూచనలు చెబుతున్నాయి.

ఒక్కసారి వద్దంటే వదిలేయకండి కూరగాయలు వద్దు.. పండ్లు వద్దు.. అంటూ మారాం చేసే పిల్లలకు బలవంతం వద్దు.. ఆహారాన్ని సరదాగా పరిచయం చేయడమే కీలకం



కొత్త ఆహారం నచ్చకపోయినా వెంటనే దాన్ని పూర్తిగా మెనూ నుంచి తొలగించాల్సిన అవసరం లేదు. కొంత విరామం తర్వాత మళ్లీ చిన్న పరిమాణంలో అందించవచ్చు. ఒక కొత్త ఆహారాన్ని పిల్లలు అంగీకరించడానికి చాలాసార్లు పరిచయం అవసరం కావచ్చు.

పిల్లల్ని కూడా వంటలో భాగం చేయండి

పండ్లు, కూరగాయలు ఎంచుకోవడం నుంచి వాటిని శుభ్రం చేయడం, సులభమైన వంట పనుల్లో సహాయం చేయడం వరకు పిల్లలను భాగస్వామ్యం చేయవచ్చు. తాము ఎంచుకున్న లేదా తయారీలో పాల్గొన్న ఆహారాన్ని ప్రయత్నించే ఆసక్తి పిల్లల్లో పెరగవచ్చని నిపుణుల సూచనలు చెబుతున్నాయి.

ప్లేట్‌లో రంగులుండేలా చూడండి

పండ్లు, కూరగాయలు, పప్పులు, గింజలు, సంపూర్ణ ధాన్యాలు వంటి వివిధ రకాల ఆహారాలను పిల్లల రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా అవసరమైన పోషకాలు అందించవచ్చు. ఫైబర్‌ కోసం పండ్లు, కూరగాయలు, బీన్స్‌, సంపూర్ణ ధాన్యాలు ఉపయోగకరమైన ఎంపికలుగా పేర్కొంటున్నారు.

భోజన సమయానికి కొన్ని నియమాలు

భోజనం, స్నాక్స్‌కు ఒక క్రమబద్ధమైన సమయం ఉండేలా చూడాలి. టీవీ, మొబైల్‌ వంటి దృష్టి మళ్లించే వస్తువులను పక్కన పెట్టి కుటుంబంతో కలిసి తినే అలవాటు పెంచడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలు తినాల్సిన పరిమాణాన్ని బలవంతంగా నిర్ణయించకుండా.. అందించిన ఆరోగ్యకరమైన ఆహారంలో వారికి కొంత ఎంపిక అవకాశం ఇవ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బలవంతం చేస్తే భోజనంపై వ్యతిరేకత పెరగొచ్చు

పిల్లలు ఒక ఆహారాన్ని తిరస్కరించినప్పుడు కోపపడటం, బలవంతంగా తినిపించడం లేదా భోజనాన్ని గొడవగా మార్చడం కంటే ప్రశాంతంగా మళ్లీ పరిచయం చేయడం మంచిది. చిన్నారుల్లో సెలెక్టివ్‌ లేదా పిక్కీ ఈటింగ్‌ ఒక సాధారణ అభివృద్ధి దశగా ఉండొచ్చని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ పేర్కొంటోంది.

పిల్లల ప్లేట్‌ నిండాలంటే ముందుగా వారి మనసు గెలవాలి.. బలవంతం కాదు, ఓపికతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేయడమే కీలకం!
🏠 Home