🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 27 Aug, 2026 | Page: 1

నేపాల్ వరదల్లో ఏపీ యాత్రికులు మంత్రి లోకేశ్‌ సమీక్ష..

అమరావతి:నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ యాత్రికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీకి చెందిన ఏడుగురు యాత్రికులు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో నలుగురు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారణ కాగా.. మరో ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.

ఏపీ మంత్రి **నారా లోకేశ్** యాత్రికుల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం అన్ని మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీ ఢిల్లీ భవన్‌ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రికి తెలియజేస్తున్నారు.

ముగ్గురి కోసం గాలింపు

ప్రస్తుతం ఆచూకీ లభించని వారిలో **కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం**, ఈషా ఫౌండేషన్‌ గ్రూప్‌కు చెందిన **శశికుమార్‌, రాజ్యలక్ష్మి** ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరి క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు సంబంధిత అధికార యంత్రాంగం నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

నలుగురు సురక్షితం.. కానీ అక్కడే

మరోవైపు ఆదోని, కర్నూలు ప్రాంతాలకు చెందిన భాస్కర్‌ శాస్త్రితో పాటు మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన 156 మంది బృందంలో ఉన్నారు. వరదల కారణంగా వారు ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

పలు సంస్థలతో సమన్వయం

గల్లంతైన వారి ఆచూకీ, చిక్కుకున్న వారి తరలింపు కోసం ఏపీ భవన్‌ అధికారులు భారత, చైనా, నేపాల్‌ రాయబార కార్యాలయాలతో పాటు గ్య్రాంగ్‌ ఇమ్మిగ్రేషన్‌ సెంటర్‌, ఈషా ఫౌండేషన్‌, ఆర్టీజీఎస్‌ సెంటర్‌, కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తున్నారు. నేపాల్‌లోని **స్యాప్రుబేసి, బీసీ, టిమురే** ప్రాంతాలు కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రికులకు కీలక మార్గాలు కాగా.. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి.

హిమాలయ ప్రాంతంలో సంభవించిన ఈ విపత్తు నేపథ్యంలో గల్లంతైన ఏపీ యాత్రికులు క్షేమంగా బయటపడాలని వారి కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ.. వీలైనంత త్వరగా వారిని సురక్షితంగా తీసుకురావడంపై దృష్టి పెట్టింది.
🏠 Home