🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 16 Aug, 2026 | Page: 1

జిల్లా.. రాష్ట్రం.. జాతీయం.. అన్నిచోట్లా ‘రాజు’దే రాజ్యం!....

సేవకు జేజేలు.. రాజశేఖర్‌రాజుకు అరుదైన గౌరవం....


351 రివార్డులు.. ఇప్పుడు మూడు అత్యున్నత పురస్కారాలు...

చిత్తూరు నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు.....

చిత్తూరు(జ్ఞాన ప్రకాష్ జర్నలిస్ట్): విధి నిర్వహణలో ప్రతిభ అంకితభావం అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా చిత్తూరు జిల్లా నాన్‌ క్యాడర్‌ ఎస్పీ రాజశేఖర్‌ రాజు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖలోనే అత్యధికంగా 351 రివార్డులు...అవార్డులు... ప్రశంసా పత్రాలు... కమెండేషన్లు... మెరిట్‌ సర్టిఫికెట్లు... మెడల్స్‌ అందుకున్న అత్యుత్తమ పోలీసు అధికారిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందడం చిత్తూరు జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్తూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించిన వేడుకల్లో రాజశేఖర్‌ రాజు మూడు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ఒకే వేదికపై అందుకున్నారు. జిల్లా...రాష్ట్ర... జాతీయ స్థాయిల్లో 2026 సంవత్సరానికి ఎంపికైన ఈ మూడు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్... చేతుల మీదుగా ఆయన స్వీకరించారు.

జిల్లా స్థాయిలో ‘బెస్ట్‌ పోలీస్‌ ఆఫీసర్‌’గా గుర్తింపు...

జిల్లా స్థాయిలో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ‘బెస్ట్‌ పోలీస్‌ ఆఫీసర్‌’ మెరిట్‌ సర్టిఫికెట్‌కు రాజశేఖర్‌ రాజు ఎంపికయ్యారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమర్థత, ప్రజల పట్ల బాధ్యతాయుత వైఖరి, నేరాల నియంత్రణలో చూపిన ప్రతిభకు ఈ గుర్తింపు లభించినట్లు అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రస్థాయిలో ‘మహోన్నత సేవ మెడల్‌’...

రాష్ట్రస్థాయిలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ‘మహోన్నత సేవ మెడల్‌’తో పాటు మెమెంటోను అందుకున్నారు. పోలీసు శాఖలో బాధ్యతలు నిర్వహిస్తూ అంకితభావంతో పనిచేసినందుకు రాష్ట్రస్థాయిలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది.

జాతీయస్థాయిలో కేంద్ర హోంశాఖ ‘అతి ఉత్కృష్ట సేవ మెడల్‌’...

రాజశేఖర్‌ రాజు సేవా ప్రస్థానంలో మరో అత్యంత ప్రతిష్ఠాత్మక గుర్తింపు జాతీయస్థాయిలో లభించింది. కేంద్ర హోంశాఖ (మినిస్ట్రీ ఆఫ్‌ హోమ్‌ అఫైర్స్‌) తరఫున అందించే ‘అతి ఉత్కృష్ట సేవ మెడల్‌’...కు ఆయన ఎంపికయ్యారు. 2026 సంవత్సరానికి జాతీయస్థాయిలో ఈ పురస్కారాన్ని అందుకోవడం ఆయన సేవా ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

ఒకే వేదికపై మూడు అవార్డులు....

జిల్లా... రాష్ట్ర...జాతీయ స్థాయిల్లో మూడు విభిన్న ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఒకే సంవత్సరంలో ఎంపిక కావడం వాటిని ఒకే వేదికపై స్వీకరించడం రాజశేఖర్‌ రాజు సేవా ప్రస్థానంలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. గతంలో ఏ పోలీసు అధికారికి లభించని రీతిలో ఈ మూడు స్థాయిల్లో గుర్తింపు రావడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌... జిల్లా ఎస్పీ తుషార్‌ డూడి...చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌... పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌...చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు రాజశేఖర్‌ రాజును అభినందించారు.పోలీసు శాఖలో అత్యున్నత స్థాయి గుర్తింపులు వరుసగా దక్కించుకోవడంతో ఆయనకు సహచర పోలీసు అధికారులు, పోలీసు యూనియన్‌ ప్రతినిధులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. సేవా రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

చిత్తూరు పోలీసు శాఖకు గర్వకారణం....

ఒక పోలీసు అధికారి తన కెరీర్‌లో సాధించిన సేవా గుర్తింపులు 351కు చేరుకోవడం విశేషమైతే.. అదే సమయంలో జిల్లా... రాష్ట్ర..జాతీయ స్థాయిల్లో మూడు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించడం మరింత అరుదైన విషయమని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. రాజశేఖర్‌ రాజు సాధించిన ఈ ఘనత చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచిందని పలువురు అభిప్రాయపడ్డారు.ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, విధి నిర్వహణలో నిబద్ధతకు గుర్తింపుగా లభించిన ఈ అవార్డులు తనకు మరింత బాధ్యతను పెంచాయని రాజశేఖర్‌ రాజు పేర్కొన్నారు. పోలీసు శాఖకు, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.351 గుర్తింపులు... మూడు స్థాయిల్లో మూడు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు... ఒకే వేదిక పై సత్కారం... రాజశేఖర్‌ రాజు సేవా ప్రస్థానంలో స్వాతంత్ర్య దినోత్సవం చిరస్మరణీయంగా నిలిచింది.
🏠 Home